Matthew 22

పెళ్ళి విందు ఉపమానం (లూకా 14:16-24)

1యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు, 2“పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది. 3ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు.

4అప్పుడు ఆ రాజు, ‘ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి’ అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు.

5కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు. 6మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు.

7కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గుల్ని సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.

8అప్పుడతడు, ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు. 9కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి’ అని తన దాసులతో చెప్పాడు. 10ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది.

11“రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు. 12రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు.

13కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు. 14ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.”

హేరోదు అనుచర గణానికి యేసు జవాబు (మార్కు 12:13-17. లూకా 20:20-26)

15అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు. 16వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు. వారు ఆయనతో, “బోధకా, నీవు యథార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ, ఎలాటి పక్షపాతం చూపవనీ మాకు తెలుసు. 17సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు.

18యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు? 19ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి” అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు.

20ఆయన, “దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారినడిగాడు. వారు, “అవి సీజరు చక్రవర్తివి” అన్నారు. 21ఆయన వెంటనే, “అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అని వారితో చెప్పాడు. 22వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.

సద్దూకయ్యుల ప్రశ్నకు జవాబు (మార్కు 12:18-27. లూకా 20:27-38)

23అదే రోజు, మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, 24“బోధకా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసికుని తన సోదరునికి సంతానం కలిగించాలి’ అని మోషే చెప్పాడు గదా.

25మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు. 26ఈ రెండోవాడు, మూడోవాడు, తరువాత ఏడోవాడి వరకూ అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు. 27వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. 28చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా?” అని అడిగారు.

29అందుకు యేసు, “మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు. 30పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు.

31
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Mat 22:32.
In this translation, this verse contains text which in some other translations appears in verses Mat 22:31-Mat 22:32.
32చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు,

‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’
అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు, చనిపోయిన వారికి కాదు” అని వారితో చెప్పాడు.

33ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు.

పరిసయ్యుల ప్రశ్నలకు జవాబు (మార్కు 12:28-34. లూకా 10:25-28)

34ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు. 35వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి, 36“బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.

37అందుకు యేసు,

“‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.
38ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.

39‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.

40ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.

పరిసయ్యులకు ప్రశ్న (మార్కు 12:35-37. లూకా 20:41-44)

41మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు, యేసు వారిని, 42“క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించాడు.

వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు.

43అందుకు యేసు, “అయితే, ‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ 44నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు’ అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు?

45దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు?” అని వారిని అడిగాడు.

ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతే కాదు, ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు.

46

Copyright information for TelULB